NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంపై సీపీఓ టి. బసవరాజు క్షేత్రస్థాయి సమీక్ష

1 min read

విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి

ప్రతి ప్రభుత్వ సేవ ప్రజలకు నాణ్యతతో చేరేలా అధికారులు పనిచేయాలి – సీపీఓ టి. బసవరాజు

హోళగుంద న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ పురోగతిని పరిశీలించేందుకు సెంట్రల్ ప్రభారి ఆఫీసర్ (సీపీఓ) టి. బసవరాజు సోమవారం హోళగుంద మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.పర్యటనలో భాగంగా గజ్జహల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇంగల్దహల్ విలేజ్ క్లినిక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హోళగుంద కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డీఆర్‌డీఏ కార్యాలయం, మహిళా పొదుపు సంఘాల కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం వెనుక నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ప్రభుత్వం నిర్మించిన పేదల గృహాలను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన సీపీఓ టి. బసవరాజు బోధన నాణ్యత, విద్యార్థుల హాజరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను కచ్చితంగా అమలు చేయాలని, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని సంబంధిత అధికారులను హెచ్చరించారు.ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామస్థుడికి వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని వైద్య అధికారులకు సూచించారు.డీఆర్‌డీఏ, మహిళా పొదుపు సంఘాల కార్యాలయాల్లో స్వయం సహాయక సంఘాల పురోగతి, మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాలపై అధికారులతో చర్చించారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే విధంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి మహిళల ఆదాయాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించిన సీపీఓ, ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం నిర్మించిన పేదల గృహాలను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.తదనంతరం బీఎల్‌వోలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమ లక్ష్యాలు సాకారమవుతాయని ఆయన తెలిపారు.ఈ పర్యటనలో ఎంపీడీవో సయ్యద్ ఉమర్, ఎంఈవోలు సుధారాణి, కబీర్ సాబ్, మండల వ్యవసాయ అధికారి ఆనంద్, హౌసింగ్ ఏఈ గోపీనాథ్ వర్మ, డిప్యూటీ ఎంపీడీవో (ప్రత్యేక అధికారి) చక్రవర్తి, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *