NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల ఉద్యోగస్తుల సంక్షేమంపై ఆయన చూపిన శ్రద్ధ విశేషం

1 min read

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘoటా పద్మశ్రీ ప్రసాద్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు  అనారోగ్య కారణoగా అకాల మరణం చెందడం పట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘoటా పద్మశ్రీ ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాఢ సంతాపాన్ని తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్  మాట్లాడుతూ నాదెండ్ల భాస్కరరావు రాష్ట్ర రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన మహానుభావులని పేర్కొన్నారు. ప్రజాసేవను జీవిత లక్ష్యంగా తీసుకుని, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. సాధారణ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేసిన ప్రజాహిత దృక్పథం ఆయనలో స్పష్టంగా కనిపించేదని గుర్తు చేశారు.ముఖ్యంగా ఉద్యోగస్తుల సంక్షేమంపై ఆయన చూపిన శ్రద్ధ విశేషమని చైర్‌పర్సన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాలకు పెంచుతూ ప్రత్యేక ప్రభుత్వ ఆడర్ (జి ఓ) అమలు చేయడం ద్వారా వేలాది ఉద్యోగుల జీవితాల్లో స్థిరత్వం మరియు భరోసాను కల్పించిన దూరదృష్టి నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రతను అందించిందని, ఉద్యోగ రంగంలో విశ్వాసాన్ని పెంపొందించిందని తెలిపారు. ఈ ఒక్క నిర్ణయం ద్వారానే ఆయన ఉద్యోగుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని చైర్‌పర్సన్ అభివర్ణించారు.అలాగే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పరిపాలనలో పారదర్శకత,సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం,వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.నాదెండ్ల భాస్కరరావు రాజకీయాల్లో విలువలు, నైతికతలను పాటిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారని ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని చైర్‌పర్సన్ అన్నారు.ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుచరులకు చైర్‌పర్సన్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ అపార దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు.చివరగా నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, ఆయన చూపిన ప్రజాసేవ మార్గంలో ముందుకు సాగడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని చైర్‌పర్సన్  పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *