వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.50 లక్షలతో నూతన షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన
1 min read
రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.50 లక్షలతో నిర్మించనున్న నూతన షెడ్ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తీపాటి నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. రైతులు, ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో ఉల్లి ధరలు పడిపోయిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రైతులకు అండగా నిలిచారని మంత్రి గుర్తుచేశారు. రైతులకు మార్కెట్ యార్డులో మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా నూతన షెడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మరో 30 నుంచి 40 కొత్త షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. మార్కెట్ యార్డు అభివృద్ధి, కార్యకలాపాలు పెరగడంతో ఈ ఏడాది మార్కెట్ యార్డు ఆదాయం రూ.8 కోట్లకు పెరిగిందన్నారు. కర్నూలు నగరంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, మార్కెట్ యార్డు చైర్మన్ అజ్మత్ బి, సెక్రటరీ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్లు హమీద్ తదితరులు పాల్గొన్నారు.



