జీవన శైలి మార్పుతోనే.. హార్ట్ స్ర్టోక్స్…
1 min read
యువతలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..
- బీపీ, షుగర్, ఓబిసిటీ తో గుండెకు చేటు..
- ఫాస్ట్ ఫుడ్, మద్యం, పొగకు దూరంగా ఉంటే మేలు…
- వ్యాయామం.. ఆరోగ్యం పై అవగాహన తప్పనిసరి..
- ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చింతా రాజ్ కుమార్
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు :మనిషి శరీరంలో కీలక పాత్ర పోషించేది గుండె. అటువంటి గుండె ఆరోగ్యంపై అవగాహన లేక … యువత హార్ట్ స్ట్రోక్ కు గురవుతూ… చిన్న వయస్సులోనే మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చింతా రాజ్ కుమార్. స్థానిక ఏ క్యాంప్ లోని హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ నేతృత్వంలో ‘ హార్ట్ అటాక్ ’ పై అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. చింతా కుమార్ గుండె నొప్పి, గుండె పట్టేసుకోవడం, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిన యువత… వ్యాయామం కూడా చేయకపోవడంతో సగటు 55 ఏళ్ల కే హార్ట్ అటాక్ తో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణాలు వ్యాయామం చేయకపోవడం… పొగ పీల్చడం, మద్యం తాగడం, తినే ఆహారం పై కంట్రోల్ ఉండకపోవడంతో బీపీ, షుగర్, ఒబిసిటీ వ్యాదిగ్రస్తుల సంఖ్య పెరిగిపోయిందని, దీంతో గుండె నొప్పి తో బాధ పడుతూ… మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచంలో కంటే భారత దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికమని.. డయాబెటిస్ ఉన్న వారిలో శరీర అవయవాలపై అధిక ప్రభావం పడుతుందన్నారు. ఈ విషయం తెలిసినా జాగ్రత్తలు తీసుకోకపోవడం పెద్ద పొరపాటన్నారు.
జాగ్రత్తలివి…
సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కు పోయే యువత.. ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. మనిషికి వ్యాయామం అనేది ప్రతిరోజు చేసే పనిలో భాగం కావాలి. ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. సైకిల్ తొక్కడం, వాకింగ్ చేయాలి. స్థూలకాయంను తగ్గించుకోవాలి. గుండె జబ్బులు రావడానికి గల కారణాలతో స్థూలకాయం ఒకటి. బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్ తినకండి. వీటిలో కొవ్వు శాతం అధికం. పండ్లు, తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్లు వుండే రైస్, పిస్తా, బ్రెడ్ తినాలని, 8 గంటలపాటు నిద్ర పోవాలని కార్డియాలజిస్ట్ డా. చింతా రాజ్ కుమార్ వెల్లడించారు.
డా. చింతా రాజ్ కుమార్ కు ఘన సన్మానం
కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నేతృత్వంలో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించిన కార్డియాలజిస్ట్ డా. చింతా రాజ్ కుమార్ ను ఫౌండేషన్ ఉపాధ్యక్షులు, డా. ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ ఘనంగా సన్మానించారు. ప్రజలకు, మెడికల్ విద్యార్థులకు గుండె నొప్పి రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించిన డా. చింతా రాజ్ కుమార్ కు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు చంద్ర శేఖర్ కల్కూర్ , డా. భవాని ప్రసాద్, లక్ష్మన్న , సభ్యులు తదితరులు ఉన్నారు.




