ఆర్యూలో… అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సులర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. వర్సిటీ వి.సి. కాన్ఫరెన్సుహాలులో ఈరోజు జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్తుపదార్ధాల కారణంగా యువత నిర్వీర్యమౌతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రకరకాల ఆకర్షణలకులోనై బంగారంలాంటి భవిష్యత్తును నాశనంచేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. రాయలసీమ యూనివర్సిటీ క్యాంపసులో డ్రగ్సుకు స్థానంలేకుండా చూసుకోవలసిన బాధ్యత వర్సిటీ వర్గాలపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంతోపాటు తెలిసో తెలియకో వాటికి బానిసలుగా మారినవారికి సరైన చికిత్స అందించడం, సాధారణ స్థితికి చేరుకొనేలా చేయాలన్నారు. నషాముక్త్ భారత్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిచ్చాయని వి.సి. తెలియజేశారు. మాదక ద్రవ్యాల నివారణకు వివిధ సంస్థలు చేస్తున్నకృషి అనన్యసామాన్యమని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ కొనియాడారు. బాధ్యత కలిగిన పౌరులుగా మాదకద్రవ్యాలజోలికి పోకుండా ఉండటంతోపాటు వాటి బారిన పడినవారికి పునరావాస కేంద్రాలద్వారా సరైన చికిత్స అందేలా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు సూచించారు. దుర్వ్యసనం ఏదైనా ఆర్ధికంగా సామాజికంగా దిగజారుస్తుందని వర్సిటీ సిడిసి డీన్ ఆచార్య పి.వి. సుందరానంద్ హెచ్చరించారు. యువజనాభాతో కూడిన భారతదేశ యువత డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలని డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండే విధంగా కృషిచేస్తామని వి.సి. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

