వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న కీళ్ల సమస్యలు!
1 min read
మారుతున్న జీవనశైలి, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు
అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా కిమ్స్ కొంపల్లిలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సంప్రదింపులు
40 ఏళ్లు పైబడిన తొలి 100 మందికి ఉచిత కన్సల్టేషన్.. గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారికీ ఉచిత సంప్రదింపులు
హైదరాబాద్, న్యూస్ నేడు : కీళ్ల సమస్యలు వయసు పెరిగిన తర్వాతే వస్తాయనుకోవడం పొరపాటని కిమ్స్ హాస్పిటల్స్ కొంపల్లి ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు తెలిపారు. మారుతున్న జీవనశైలి, అధిక బరువు, శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనూ కీళ్ల నొప్పుల సమస్యలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా నొప్పి తీవ్రత పెరగకుండా, రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తపడవచ్చని సూచించారు.అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ హాస్పిటల్స్ కొంపల్లి ఆధ్వర్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి 100 మంది అర్హులైన రోగులకు ఉచిత కన్సల్టేషన్ అందించడంతో పాటు, గతంలో శస్త్రచికిత్స చేయించుకున్నవారికి కూడా ఉచిత వైద్య సంప్రదింపులు కల్పించారు. కీళ్ల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సమస్యలను ముందుగానే గుర్తించేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ కొంపల్లి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ సర్జన్లు డా. సాయి ఫణి చంద్ర, డా. డి. హారిప్రకాష్, డా. చైతన్య కిషోర్, డా. రోషన్ కుమార్ జైస్వాల్, మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలామంది ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, నడకకు సమయం కేటాయించకపోవడం, శరీర బరువు పెరగడం వంటి అలవాట్లకు లోనవుతున్నారని చెప్పారు. వీటివల్ల మోకాళ్లు, తుంటి, భుజాలు వంటి కీళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. వయసుతో వచ్చే కీళ్ల అరుగుదలతో పాటు, క్రీడల్లో గాయాలు, పాత గాయాలు, కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ సమస్యలు కూడా కీళ్ల నొప్పులకు కారణమవుతాయని వివరించారు.ప్రారంభంలో స్వల్పంగా కనిపించే కీళ్ల నొప్పి క్రమంగా పెరగవచ్చు. కొందరిలో కీళ్ల వాపు, బిగుతు, కదలికల్లో ఇబ్బంది, మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం, నడవడం వంటి పనులు చేయడంలో సమస్యలు ఎదురవుతాయి. ఉదయం నిద్రలేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం, నడిచేటప్పుడు నొప్పి రావడం, కీళ్ల కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.కీళ్ల నొప్పులన్నీ ఒకే రకమైన సమస్య వల్ల రావని, కారణాన్ని బట్టి చికిత్స మారుతుందని వైద్యులు స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలు, ఎక్స్రే లేదా ఇతర పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారిస్తారు. ప్రతి కీళ్ల నొప్పికీ శస్త్రచికిత్స అవసరం ఉండదని, చాలా సందర్భాల్లో మందులు, ఫిజియోథెరపీ, తగిన వ్యాయామాలు, బరువు నియంత్రణతో ఉపశమనం పొందవచ్చని తెలిపారు. సమస్య తీవ్రత, కీళ్ల దెబ్బతిన్న స్థాయిని బట్టి ఇతర చికిత్సా విధానాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ శరీరానికి తగిన నడక, వ్యాయామం చేయాలి. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను నిపుణుల సూచనలతో పాటించాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా మధ్యమధ్యలో కదలాలి. పోషక విలువలున్న సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు తగిన విశ్రాంతి పొందాలి. నొప్పి ఉన్నప్పుడు సొంతంగా మందులు వాడటం, వైద్యుల సలహా లేకుండా వ్యాయామాలు చేయడం మానుకోవాలని సూచించారు.


