ఉద్యానవనాల అభివృద్ధికి కీలక అడుగులు
1 min read
6 పార్కుల అభివృద్ధికి మంత్రి టీ.జీ. భరత్ శంకుస్థాపన
కర్నూలు, న్యూస్ నేడు: గురువారంనగరంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన విశ్రాంతి వాతావరణం కల్పించే దిశగా ఉద్యానవనాల అభివృద్ధికి కీలక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1.05 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఆరు పార్కుల పనులకు మంత్రి, కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడంలో భాగంగా ఒకేసారి రూ.1.05 కోట్లతో ఆరు పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పారు. పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేదతీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.కమిషనర్ మాట్లాడుతూ.. 45వ వార్డులోని ప్రేమ్‌నగర్ పార్క్-2ను రూ.15 లక్షలతో, 44వ వార్డులోని ఎంపీఎల్ ఎంప్లాయీస్ కాలనీ పార్క్‌ను రూ.15 లక్షలతో, ఎల్‌ఐసీ కాలనీ పార్క్‌ను రూ.25 లక్షలతో, 24వ వార్డులోని మధుర్‌నగర్ పార్క్‌ను రూ.15 లక్షలతో, 23వ వార్డులోని సీ క్యాంప్ పార్క్‌ను రూ.15 లక్షలతో, 25వ వార్డులోని బిర్లా భావన్ పార్క్‌ను రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, డిసిపి వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.


