అందరం కలిసికట్టుగా ముందుకు సాగి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: అందరం కలిసికట్టుగా ముందుకు సాగి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు. సోమవారం పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీపీ, మాజీ కో ఆప్షన్,మాజీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ఫలితాలను పునరావృతం చేసేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన మోసాలను గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో పథకాలు ఎలా అందేవి, ప్రస్తుతం ఎలా అందుతున్నాయో ప్రజలను అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు స్పష్టమవుతుందని అన్నారు.అనంతరం తాజా మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, మండల కన్వీనర్, అనుబంధ సంఘాల నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


