ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో అందరకీ ఆరోగ్యం,రైతులు అభివృద్ధికి కొత్త దిశ
1 min read

జిల్లా వ్యవసాయశాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఐఏడీపీ హాల్లో మంగళవారం ప్రకృతి వ్యవసాయ అమలుపై విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె. హబీబ్ భాషా ఘనంగా నిర్వహించామని తెలిపారు. జీలుగుమిల్లి, కోయ్యలగూడెం, పోలవరం మరియు దెందులూరువంటి వివిధ మండలాలలు నుండి సుమారు 120 మంది కేడరు సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి యస్.కె.హబీబ్ బాషా, జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. ఇక ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలన్నా లేదా సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలన్నా, అధికారిక పోర్టల్ elururythusampada.in ద్వారా సులభంగా బుకింగు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పోర్టల్ గురించి అవగాహన లేని వారికి విస్తృతంగా ప్రచారం చెయ్యాలని, అందరూ ఈ వేదికను వినియోగించుకుని నాణ్యమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పొందాలని సూచించారు. బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా కషాయాలు తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని సులభతరం చేయవచ్చని, రైతులకు అవసరమైన ఇన్పుట్లను సమయానికి అందించడం అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు. అలాగే ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగు (PMDS) విధానంలో నవధాన్యాలు సాగును ప్రోత్సహిస్తూ, ప్రతి రైతుకు విత్తన కిట్లు అందించి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కలుషిత ఆహారం కారణంగా అనేక రకాలు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అందువల్ల ప్రజలు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు నుండి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఆరోగ్యాన్ని కాపాడు కోవడంతో పాటు రైతులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్యాడరు సభ్యులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


