బాలల సంక్షేమంలో నిర్లక్ష్యం సహించం
1 min read

కర్నూలులో ఆకస్మిక తనిఖీలకు డీఎల్ఐసీ శ్రీకారం
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లా స్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ (DLIC) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న బాలల సంరక్షణ కేంద్రాల సమగ్ర తనిఖీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్, డీఎల్ఐసీ చైర్మన్ నూరుల్ ఖమర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లలకు అందుతున్న వసతులు, భద్రత, సంక్షేమ సేవలపై సమగ్ర సమీక్ష చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.తనిఖీల తొలి రోజున జిల్లా జాయింట్ కలెక్టర్, డీఎల్ఐసీ చైర్మన్ నూరుల్ ఖమర్ నేతృత్వంలో కర్నూలు నగరంలోని సి. క్యాంప్ ప్రాంతంలో ఉన్న శిశు గృహం (ప్రత్యేక దత్తత సంస్థ)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, నివాస వసతులు, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, రికార్డుల నిర్వహణ అంశాలను సవివరంగా పరిశీలించారు.ఈ తనిఖీల ద్వారా జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో పారదర్శకత పెరిగి, పిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన సంరక్షణ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డీఎల్ఐసీ కన్వీనర్ టి. శారద (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్), కమిటీ సభ్యులు కె. మధు సుధాకర్ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు), రాయపాటి శ్రీనివాస్ (ఎన్జీవో లయన్), డాక్టర్ మంజుష (తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్), కె. చంద్రశేఖర్ (సైకాలజిస్ట్), విజయ రాజు (సోషల్ యాక్టివిస్ట్), ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

