తుంగభద్ర జలాశయానికి నూతన శోభ
1 min read
3 కొత్త క్రెస్ట్ గేట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్
మూడు రాష్ట్రాల రైతులకు భరోసా – తుంగభద్ర పరిరక్షణకు సంయుక్త కార్యాచరణ
కర్నూల్ న్యూస్ నేడు; మునిరాబాద్/హొస్పేట్:దక్షిణ భారతదేశానికి జీవనాడిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రెస్ట్ గేట్లను ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. వేలాది మంది రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సంఘాల నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తుంగభద్ర డ్యామ్‌కు గత ఏడాది సంభవించిన నష్టం నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తూ పాత గేట్ల స్థానంలో కొత్తగా 33 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్ల నిర్మాణంతో జలాశయ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం, భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. సభలో మాట్లాడిన ముఖ్యమంత్రులు తుంగభద్ర జలాశయం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లక్షలాది ఎకరాల సాగుకు ప్రాణాధారమని పేర్కొన్నారు. జలాశయంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, ప్రత్యామ్నాయ జలవనరుల అభివృద్ధి, అంతర్రాష్ట్ర జల సమన్వయంపై ప్రత్యేక కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, తుంగభద్ర పరిరక్షణలో మూడు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల సమర్థ వినియోగానికి రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం అంతర్రాష్ట్ర సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా, ప్రముఖ జలవనరుల నిపుణుడు కన్నయ్య నాయుడు, తుంగభద్ర బోర్డు అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.తుంగభద్ర రైతు సంఘం నాయకులు కొంచిగేరి గోవిందప్ప, చన్నపట్టణ కాజావలి సాబ్, ఎం. వీరభద్ర నాయక్, దరూరు సాగర్ గౌడ్, చన్నపట్టణ మంజునాథ్ గౌడ్, జేడియప్ప, దరూరు బసవరాజ స్వామి, తిప్పేరు ద్రగౌడ్, రాజశేఖర్ గౌడ్, వీరణగౌడ్, హేమంత్ రాజ్ గౌడ్, డా. పురుషోత్తమగౌడ్ తదితరులు కార్యక్రమానికి హాజరై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.తుంగభద్ర జలాశయానికి నూతన గేట్ల ప్రారంభం మూడు రాష్ట్రాల మధ్య జల సహకారానికి ప్రతీకగా నిలిచిందని, రైతుల భవిష్యత్తుకు ఇది ఒక కీలక మైలురాయిగా మారుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.


