ప్రాజెక్ట్ పూర్తయితే ఏడాదికి వెయ్యికోట్ల ఆర్ధిక లావాదేవీలు జరుగుతాయి
1 min read

ప్రజలతో గ్రామ సభలు పెట్టి అపోహలు తొలగిస్తాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వెనుకబడ్డ మారుమూల ప్రాంతాలు కూడా పట్టణాలతో సమంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబుగారి సహకారంతో పట్టుబట్టి పోలవరం ప్రాంతానికి ఈ నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టును తీసుకొస్తున్నామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తో కలిసి నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు సంబంధించి సమీక్ష అనంతరం ఎంపి పుట్టా మహేష్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేవీ అధికారులతో కాకినాడ, విశాఖ తీర ప్రాంతం ఇక్కడికి దగ్గరగా ఉండటం వల్ల కూడా కేంద్రం తమ ప్రతిపాదనను ఆమోదించిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, అపోహలు వీడి స్థానిక ప్రజలంతా సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే ఈ ప్రాజెక్ట్ వలన ఎన్నో ఉద్యోగాలు, స్ధానికులకు ఉపాధి కలుగుతుందన్నారు. డిఫెన్స్ వారు ఈ డిపో ఏర్పాటుకు అత్యంత రక్షణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైజాగ్ లో కూడా ఇటువంటి తరహా ప్రాజెక్ట్ ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రారంభంలో 500 నుంచి 1000 మందికి భవిష్యత్తులో 2000 మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ చెప్పారు. స్థానిక యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు. దాదాపు 2 వేల మంది నేవీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తారని అధికారులు తమకు చెప్పారని, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, హోటళ్ల వంటివి రావడంతో భవిష్యత్తులో ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన “కేంద్రీయ విద్యాలయం” సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని నేవీ అధికారులు చెప్పారన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటకం కూడా అభివృద్ధి అవుతుంది. నిర్మాణాలు ప్రారంభించినప్పటి నుంచే 60 శాతం మంది పనివారిని స్థానికంగానే తీసుకుంటామని నేవీ అధికారులు తమకు హామీ ఇచ్చారన్నారు. 1944 నుంచే దేశంలో ఆయుధ డిపోల ఏర్పాటు జరుగుతోందని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయనీ, విశాఖతో సహా దేశంలో అనేక ఆయుధ డిపోలు ఉన్నాయని ఇప్పటి వరకూ ఎటువంటి ప్రమాద ఘటనలు జరగలేదని ఎంపీ వివరించారు. జీలుగుమిల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేది డిపో మాత్రమే, తయారీ కర్మాగారం కాదని, ఎటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని మరోసారి కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రజల్లో అపోహలు ఉంటే తొలగిస్తామని,మీడియా సహకరించి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. డిపో ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అని ఈవిషయం ఇందులో స్ధానిక నాయకులకు, ఇతరులకు ఎటువంటి ప్రమేయం ఉండదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేశాకే పనులు ప్రారంభిస్తారని, త్వరలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అంగీకారం తీసుకుంటామన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషివల్లే ఈ ప్రాజెక్ట్ పోలవరం ప్రాంతానికి వచ్చిందని చెబుతూ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు.


