NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి–డోన్–బేతంచెర్లను కరువు మండలాలుగా ప్రకటించాలి

1 min read

రైతులకు ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి

హంద్రీ–నీవా నీటితో చెరువులను నింపాలి: రైతు సంఘం

ప్యాపిలి న్యూస్ నేడు: వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ప్యాపిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్ బి.భారతికి సంయుక్తంగా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.డోన్ నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ హంద్రీ–నీవా కాలువ ద్వారా నీటితో నింపాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను రద్దు చేయడంతో పాటు, అవసరమైన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోతున్న కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచి, రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు.రాయలసీమ ప్రాంతాన్ని కరువు, విపత్తు ప్రభావిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి అర్హులైన ప్రతి రైతుకు త్వరితగతిన పరిహారం అందించాలని కోరారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, సీపీఐ ప్యాపిలి మండల కార్యదర్శి మహేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బూత్ కార్యదర్శి మల్లికార్జున, రాజా మురళీకృష్ణ, బి.రఘు, బి.మల్లికార్జున్ రెడ్డి, కొండయ్య, బొరెడ్డి ప్రభాకర్ రెడ్డి,బోరెడ్డిరఘనాథ్ రెడ్డి,పిక్కిలి పాండురంగడు,సీపీఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్, కలచట్ల నాగరాజు, పి.వెంకటేష్, ఎం.పెద్దయ్య, మస్తాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేంద్ర నాయుడు, నాగరాజు, ఆంజనేయులు, మనోహర్, ఏఐటీయూసీ, హమాలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author