మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం పోస్టర్ విడుదల
1 min read

– పిల్లల హక్కులకు ప్రాధాన్యత
కర్నూలు, న్యూస్ నేడు : మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడే ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కర్నూలులో కోనేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో “జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు ఈ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పిల్లలకు న్యాయ పరమైన హక్కులు చాలా ముఖ్యం. బాల కార్మికులు, బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణా, బాల భిక్షాటన వంటి సమస్యలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. ప్రజలు ఈ తరహా ఘటనలను గమనిస్తే, వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098, లేదా 112, 100 వంటి టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లలకు రక్షణ, సంరక్షణ కల్పించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్న Just Rights for Children బృంద సేవలను ప్రశంసించిన జిల్లా ఎస్ పి గారు, తక్షణమే ఎఫ్ఐఆర్లు (FIRs), జీడీలు (GDs) నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ భాగస్వామ్యంతో పోలీసు శాఖతో సమన్వయం బలపడినట్టు, పిల్లల రక్షణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని వ్యాఖ్యానించారు. అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు జనజాగరణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పిల్లల అక్రమ రవాణాలో పాల్గొనే వారికి కఠిన శిక్షలు విధించబడతాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యుడు మధు సుధాకర్, Just Rights for Children జిల్లా కోఆర్డినేటర్ మౌనిక, ఏరియా కోఆర్డినేటర్ ముని స్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సుంకన్న, మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

