నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం
1 min read

నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ విజ్ఞప్తి
సి అండ్ డి వేస్టేజ్ నిర్వహణకునూతన విధానం
తడి, పొడి చెత్తా వేర్వేరు చేసి ఇవ్వాలి
పశువులను రహదారులపైకి వదిలితే చర్యలు
24/7 సేవలు అందించేందుకు ప్రత్యేక బృందం
అర్హులందరు ఇళ్ళకు దరఖాస్తు చేసుకోవాలి
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం కర్నూలు నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని, నగరాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి పౌరుడు తమ సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు.
మెరుగైన పారిశుద్ధ్యానికి ప్రజల సహకారం కీలకం
మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు నగర ప్రజలు సహకరించి, ఇకపై తడి, పొడి చెత్తా వేర్వేరు చేసి కార్పొరేషన్ సిబ్బందికి అందించాలని కమిషనర్ కోరారు. బహిరంగ ప్రదేశాల్లో, డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం వేయోద్దని సూచించారు. సాలిడ్ వెస్టేజ్ మేనేజ్మెంట్‌ను సమర్థవంతంగా అమలు నిర్వహించగలిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రొత్సాహం లభిస్తుందన్నారు. తమ సిబ్బంది ఎంతలా కష్టపడుతున్నప్పటికి, ఆశించిన స్థాయిలో ప్రజల సహకారం లేకపోవడంతో కార్మికుల కష్టం వృథా అవుతుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సంపూర్ణ సహకారం అందిస్తే మార్పు సుస్పష్టంగా కనబడుతుందన్నారు.
సి అండ్ డి వేస్టేజ్ నిర్వహణకు నూతన విధానం
భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు సరికొత్త విధానం తీసుకొస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. ఆగస్టు 1 నుండి ప్రత్యేక నెంబర్ పెట్టి, వాటి ద్వారా నగర పరిధిలో సి & డి వేస్టేజ్ సేకరించి, జొహరపురం డంపింగ్ యార్డ్ వద్దనున్న సి & డి వేస్టేజ్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు తరలిస్తామని చెప్పారు. తద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ చేపట్టి పునర్వినియోగానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ట్రాక్టర్‌కు రూ.500, టిప్పర్‌కు రూ.1000 చొప్పున రవాణా రుసుము మాత్రమే ప్రజలు చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా నగరంలో నిర్మాణపు వ్యర్థాలను లేకుండా చూడవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.
పశువులను రహదారులపై వదిలితే చర్యలు
నగర రహదారులపై పశువులను ఇకపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. రహదారులపై సంచరించే పశువులను ఆధీనంలోకి తీసుకొని, మూడు రోజుల్లోపు వచ్చిన యజమానులకు జరిమానా విధించి పశువులను అప్పగిస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల్లోపు పశువులను తీసుకెళ్లని పక్షంలో వాటిని గోశాలకు తరలిస్తామన్నారు. వీధి శునకాల బెడద నివారణకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను రోజువారీ సామర్ధ్య సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజలకు 24/7 కార్పొరేషన్ సేవల: నగర ప్రజలకు 24 గంటలపాటు సేవలు అందించేందుకు సిబ్బందితో ప్రత్యేక బృందం, ఒక టోల్ ఫ్రీను త్వరలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. వాటిని ద్వారా తాగునీటి సమస్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, ఇతరత్రా సేవలను సులువుగా పొందవచ్చని సూచించారు.
పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్: నగరాభివృద్ధికి పన్నులు పెంచకుండా ప్రభుత్వాలు ఎంతగానో సహకరిస్తున్నాయని, ఆర్థికంగా బలంగా ఉంటేనే మౌలిక సదుపాయాల కల్పన, నగరాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న పన్నులను కూడా కొంతమంది చెల్లించకపోవడం సమంజసం కాదని కమిషనర్ అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయం పన్నులే అని, ఏటా రూ.100 కోట్ల ఆదాయం నగరపాలకకు రావాల్సి ఉంటుందన్నారు. అయితే కొంతమంది పన్నుల చెల్లింపునకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వారికి పన్నుదారులు సహకరించి సత్వరమే తమ ఆస్తి, కొళాయి, ట్రేడ్, వినోద పన్ను బకాయిలను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు.
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, వీధి దీపాలు, గుంతలు పూడ్చటం వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. నగరంలో తొలుత 9 పార్కులను ఎంపిక చేశామని, వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. వర్షపునీరు నిలవకుండా డ్రైనేజీ కాలువలు, రహదారులను పునః పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరానికి 60 ఎంఎల్‌డిల మురుగునీటి శుద్ది కేంద్రాలు అవసరమని, 58 ఎంఎల్‌డి ఎస్టీపిల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని, ఇంకా అవసరమైన 2 ఎంఎల్‌డిల ఎస్టిపికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అర్హులందరికీ ఇళ్ళులకు దరఖాస్తు చేసుకోవాలి:
నగరంలో ఇళ్ళులు లేని పేదలు గృహాల కోసం తమ స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 2 సెంట్ల స్థలంతో పాటు నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, టిడ్కో నందు ఖాళీ గృహాలను సైతం కేటాయిస్తామని తెలిపారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో వీధి వ్యాపారుల కోసం జోన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఇకపై వీధి వ్యాపారులు ఎక్కడబడితే అక్కడ వ్యాపారం చేసుకోకుండా, ఆమోదయోగ్యం ఉన్న ప్రదేశాల్లో వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. ఎవరీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నామని, వీధి వ్యాపారులంతా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి కోరారు.
సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందించాల్సిందే..కార్పొరేషన్, సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాల్సినని, అందులో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రతి ఉద్యోగి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, సమన్వయంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ యన్.చిన్నరాముడు పాల్గొన్నారు.

