కెసి కెనాల్ పరిశుభ్రతలో ప్రజల పాత్ర కీలకం
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగర పరిధిలో కెసి కెనాల్‌ను పరిశుభ్రంగా పరిరక్షించడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇంజనీరింగ్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి కార్ల్ మార్క్స్ నగర్, అశోక్ నగర్, వినాయక ఘాట్ ప్రాంతాల్లో కెసి కెనాల్‌ను పరిశీలించారు.కెనాల్‌లో చెత్తాచెదారం పారవేయకుండా నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది, జలవనరుల శాఖ లస్కర్లు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దెబ్బతిన్న ప్రదేశాల్లో రక్షణ వలయానికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కెనాల్‌లోకి డ్రైనేజీ కాలువల నీరు చేరుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి మళ్లింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నడిబొడ్డున ప్రవహించే కెనాల్ నగరానికి అందాన్ని చేకూర్చేదిగా ఉండాలని, అయితే పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త పారవేయడం వల్ల అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం ఆవేదనకరమన్నారు. నీటి ప్రవాహం లేని సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా తయారై, దోమలు తదితర విషకీటకాలు విస్తరించి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రక్షణ వలయాలను ధ్వంసం చేసి చెత్త పారవేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కెనాల్ శుభ్రత, మరమ్మతుల కోసం ప్రజాధనం వ్యయమవుతోందని గుర్తుచేశారు. కెసి కెనాల్‌లో త్వరలో స్వచ్ఛత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు బాధ్యతతో వ్యవహరించి ఇకపై చెత్తను నగరపాలక వాహనాలకు అప్పగించాలని కమిషనర్ కోరారు.కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ బాలచంద్ర రెడ్డి, నగరపాలక సంస్థ ఎస్‌ఈ రమణమూర్తి, డిఈఈ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

