రీ-సర్వే కార్యక్రమాలను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా అమలు చెయ్యాలి
1 min read

రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ వేగవంతం చెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు, 22 ఏ సమస్యలు, పిజిఆర్ఎస్ లో వచ్చిన పిటిషన్ల పరిష్కారం వంటి అంశాలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్. దేవకీదేవిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ముఖ్యంగా పట్టాదారు పాసు పుస్తకాలలో జాయింటు ఎల్పీఎంలు, భూవిస్తీర్ణంలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా సరిచేసి మాత్రమే రైతులకు అందించాలని స్పష్టం చేశారు. రీ-సర్వే ఫేజ్ 1, 2, 3, 4 అమలు పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రణ మరియు పంపిణీపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కొత్తగా రీ-సర్వే చేపడుతున్న గ్రామాల్లో అత్యంత జాగ్రత్తగా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసిన ఫేజ్ 1, 2, 3 లకు సంబంధించిన రికార్డులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచడంతో పాటు, వాటిని డిజిటల్ రూపంలో ఆన్లైన్‌లో పొందుపరచాలని జిల్లా సర్వే విభాగాన్ని ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాలు విషయంలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, జాయింటు ఎల్పీఎంలు, భూవిస్తీర్ణంలో తేడాలు, ఇతర రికార్డులు లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దిన తరువాత మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. రైతులకు సరైన భూహక్కులు అందేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా జరిగితే రైతులకు భూ హక్కులుపై స్పష్టత కలుగుతుందని, ఫేజ్ ఫోర్ పనులను నిర్దిష్ట గడువులోపుగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు రీ సర్వే, మ్యూటిషన్ పూర్తయిన గ్రామాల్లో ఎటువంటి అవకతవకులకు తావు లేకుండా మరోసారి వెరిఫికేషన్ చేసుకొని మే నెల నాటికి పక్కా డేటా తో ఉండాలన్నారు. మే నుండి ఆగస్టు వరకు నిర్వహించే రీ సర్వే కు సంబంధించి రైతులకు ముందుగానే సమాచారాన్ని అందించే విధంగా పక్కా కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. 22ఏ భూ సంబంధిత సమస్యలపై పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ధరఖాస్తులను ఎన్ని వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడ వివాదాలు తావులేకుండా పంపిణీ ప్రక్రియను నియోజకవర్గ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించి పంపిణీ చెయ్యాలని అన్నారు. అదేవిధంగా పంపిణీ షెడ్యూల్‌పై గ్రామస్థాయిలో ముందస్తు సమాచారాన్ని అందించేందుకు వీఆర్ఏలు, గ్రామ సర్వేఅధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని తెలిపారు.ఈ సందర్భంగా రికార్డులు నిర్వహణ, ఫీల్డ్ స్థాయి అమలు, ప్రజలకు అందిస్తున్న సేవలు నాణ్యతపై అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చి, పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవోలు యం.వి.రమణ, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోరు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ,తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు,మండల సర్వే అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

