ఎస్ డి పి ఐ నాయకులు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కి వినతి
1 min read
హొళగుంద పెద్ద మసీదు సమీపంలో డ్రైనేజీ సమస్య
మురుగునీటితో ప్రజల ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారం చూపాలి
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద గ్రామంలోని పెద్ద మసీదు సమీపంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ నాయకులు, స్థానిక నివాసులు పంచాయతీ అధికారులను కోరారు.కొద్దిపాటి వర్షం పడినప్పటికీ డ్రైనేజీ పూర్తిగా నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తోందని వారు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పారిశుధ్య సమస్యతో పాటు దుర్వాసన, దోమల బెడద ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత సిబ్బందిని పంపించి డ్రైనేజీని పరిశీలించి శుభ్రం చేయించాలని కోరారు. కేవలం తాత్కాలికంగా డ్రైనేజీని శుభ్రం చేయడం కాకుండా, భవిష్యత్తులో మురుగునీరు రోడ్డుపైకి రాకుండా డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడేలా పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ కార్యదర్శి ఎస్. చెన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ 5వ వార్డు ఇన్చార్జ్ అలిగనూరు అబ్రార్, 3వ వార్డు ఇన్చార్జ్ ముల్లా వాజిద్తో పాటు స్థానిక నివాసులు పాల్గొన్నారు.



