‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’కి స్పందన
1 min read

విద్యుత్ సమస్యలను వివరించిన 67 మంది వినియోగదారులు
ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
తిరుపతి, న్యూస్ నేడు : విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఎపిఎస్పిడిసిఎల్ నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి కార్యక్రమం జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 67 మంది వినియోగదారులు విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ లైన్ మార్పు, కాలిపోయిన/చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ల మార్పు, లో-ఓల్టేజ్ సమస్య. ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, ఇనుప విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలు వీటిలో వున్నాయి. ఈ అంశాలపై వారికి సిఎండి శివశంకర్ లోతేటి సమాధానమిస్తూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని వివరించారు. గతంలో ‘డయల్ యువర్ సిఎండి’ ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలలో అధిక శాతం సమస్యల్ని ఇప్పటికే పరిష్కరించామన్నారు. సాంకేతికపరమైన అడ్డంకులున్నవి మాత్రమే పెండింగులో వున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్డి) కె. గురవయ్య, డైరెక్టర్/ ఫైనాన్స్ (ఎఫ్ఎసి) కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పి. హెచ్. జానకి రామ్, జె. రమణా దేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, యం. మురళీకుమార్, పి. సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు చక్రపాణి, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర రావు, బాస్కర్ రెడ్డి, ప్రసాద్, వెంకట రాజు, విజయన్, తదితరులు పాల్గొన్నారు.

