ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం
1 min read

– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: దేశ సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ ప్రతి రంగంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవలు ప్రశంసనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక కర్నూలు నగర శివారులోని మునగాలపాడు వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో కేశవ స్మృతి మండలి నూతన భవన నిర్మాణానికి అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ విరజానంద స్వామి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో కూడిన వారన్నారు. తను కూడా ఎనిమిదో ఏట నుంచి ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లేవాడినని తద్వారా క్రమశిక్షణ, మంచి నడవడిక ఆలబడ్డాయి అన్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే పెద్దలను గౌరవించే సంస్కృతి, దేశం పట్ల భక్తి అలవాడేలా సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు. చిన్నప్పటినుంచే పిల్లలలో క్రమశిక్షణ మంచి నడవడిక అలవాడితే తద్వారా సమాజం దేశం అభివృద్ధి చెంది బలంగా తయారవుతుందని అన్నారు. ప్రపంచంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ సేవకు అంకితమయ్యే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని టీజీ వెంకటేష్ కొనియాడారు. సంఘ శాఖలో క్రమశిక్షణను అలవర్చుకుని తమ కుటుంబాలను కూడా వదులుకొని సమాజం కోసమే జీవితాలను అంకితం చేసిన వారిని ఎంతోమందిని కూడా ఇక్కడ చూడవచ్చు అని ఆయన అన్నారు. అటువంటి సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో తాము కూడా భాగం కావడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. సంస్థ చేపడుతున్నటువంటి కేశవ స్మృతి మండలి నిర్మాణానికి తన తల్లి అయినా దివంగత శ్రీమతి గౌరమ్మ పేరు మీద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ముందు ముందు కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ చేపట్టే ఎటువంటి కార్యక్రమాల కైనా తనవంతుగా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని టీజీ వెంకటేష్ హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థలదాతలు శ్రీ భగవాన్ బాలసాయి సెంట్రల్ ట్రస్టీ రామారావు, ఆదర్శ అనంతయ్య, ఆర్ఎస్ఎస్ అఖిలభారత సేవా ప్రముఖ సెంథిల్, క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, మేయర్ బి వై రామయ్య, ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


