ఎస్సీ సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
1 min read
ఏపి మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డా:పెదపూడి విజయ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఎస్సీ సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని, పూర్వవైభవాన్ని తప్పక తీసుకువస్తామని ఏపి మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డా:పెదపూడి విజయ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక గిరిజన భవనంలో మంగళవారం పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపి మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డా.పెదపూడి విజయ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలు సంక్షేమానికి, అభివృద్ధికి పూర్వవైభవం తీసుకువస్తామని, ఉమ్మడి జిల్లాలో రెండు పర్యటనలు చేస్తామని, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని, కలిసికట్టుగా పనిచేసి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, మనకు మంచి రోజులు తప్పక వస్తాయని అన్నారు. దళిత హక్కులు, కార్పొరేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగ,ఉపాధి, శిక్షణ పూర్తిఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే రాష్ట్రం అంతా పర్యటించి నా పరిధిలో ఉన్న సమస్యలు తక్షణం పరిష్కారం చేస్తానని అన్నారు. తన పరిధిలోలేనివి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యలు నివేదికలు అందించి, నూరుశాతం సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. మాల యువతీ, యువకులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకు అనుగుణంగా సమస్యలు పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు.సమాజంలో మాలలు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి సీనియర్ నాయకులు నుండి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇతర సంక్షేమ పథకాలను మాలలకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. నిరుపేదలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ కార్యక్రమాలు అమలులో అధికారులు సమన్వయంతో పనిచేసి, లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా అన్ని విధాలా కృషిచేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, ఏపి మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, కృష్ణాజిల్లా డైరెక్టరు దయాల రాజేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.


