NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నెమళ్లకుంట దత్తత గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు:   బండిఆత్మకూరు మండలం, నెమళ్లకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ దత్తత గ్రామంగా తీసుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం బండిఆత్మకూరు మండలంలో జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న నెమళ్లకుంట గ్రామంలో పునరుద్ధరణ పనులు పూర్తిచేసుకున్న పెద్దమ్మతల్లి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నెమళ్లకుంట గ్రామానికి పర్యటన చేసిన సమయంలో గ్రామస్థులు పెద్దమ్మతల్లి దేవాలయ పునరుద్ధరణతో పాటు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రం నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టాలని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అందులో భాగంగా ముందుగా పెద్దమ్మతల్లి దేవాలయ పునరుద్ధరణ పనులను పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా, అర్హత ప్రమాణాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా గ్రామంలోని నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు అవసరమైన వంట సౌకర్యాల కల్పనలో భాగంగా సుమారు 44 గ్యాస్ స్టవ్‌లు మరియు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరితగతిన గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. దత్తత గ్రామంగా తీసుకున్న నెమళ్లకుంటలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తామని  కలెక్టర్ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి రవికుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, తాసిల్దార్, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

About Author