ఉద్రిక్తతకు దారి తీసిన విద్యార్థుల ఆందోళన…
1 min read
విద్యార్థులపై దురుసుగా వ్యవహరించిన సిఐ పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థి నాయకులు
న్యూస్ నేడు, పత్తికొండ: మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలను పత్తికొండ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పత్తికొండలో నాలుగు స్తంభాల కూడలి వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వెనుకబడిన పత్తికొండ ప్రాంతానికి మంజూరైన మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను పత్తికొండలో కాకుండా కంబాలపాడు ల ఏర్పాటు చేయడాన్ని గత 15 రోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను నిలువరించాలని స్థానిక సీఐ జయన్న తన పోలీసుల సిబ్బందితో విద్యార్థులపై దురుసుగా వ్యవహరించారు. ఎవరి అనుమతి తీసుకుని ఆందోళనలు చేస్తున్నారని విద్యార్థులపై సిఐ జయన్న విరుచుకుపడ్డారు. దీంతో విద్యార్థి నాయకులు విద్యార్థులు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకోవడానికి సర్వశక్తులు వడ్డారు. పోలీసులు విద్యార్థి నాయకులను లాక్కెళడానికి ప్రయత్నించగా, విద్యార్థులు పోలీసులను దీటుగా అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు విద్యార్థి నాయకులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని తమ ఆందోళనలు తీవ్రతరం చేశారు. స్థానిక డిప్యూటీ తాసిల్దార్ శ్రీదేవి జోక్యం చేసుకొని విద్యార్థుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, ఇంతటితో ఆందోళనలు విరమించాలని కోరడంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు.



