విజయ గాథ – నంద్యాల జిల్లా
1 min read
చెరువు నిండితే… గ్రామ జీవితం పండుతుంది
ఉపాధి హామీ పనులతో దేవరబండ చెరువుకు పునర్జీవం
నంద్యాల జిల్లా రైతుల ఆశలకు కొత్త నీరాజనం
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా డోన్ మండలానికి చెందిన దేవరబండ గ్రామం… మండల కేంద్రానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద గ్రామపంచాయతీ. ఈ గ్రామానికి రేకులకుంట అనే మజర గ్రామం కూడా కలిసివుంటుంది. వేరుశనగ ప్రధాన పంటగా సాగు చేసే ఈ ప్రాంత రైతుల జీవనాధారం ఒకే ఒక చెరువు – “దేవరబండ చెరువు”. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువు కేవలం దేవరబండకే కాదు… కొచ్చేరువు, రేకులకుంట, దేవరకొండ, చింతలపేట గ్రామాల వ్యవసాయానికి కూడా ప్రధాన ఆధారం.ఈ చెరువు నీటిపైనే ఆధారపడి నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు 250 నుండి 300 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. చెరువు పరిసరాల్లో ఉన్న 40 నుంచి 50 బోర్లలో నీటి లభ్యత కూడా ఈ చెరువుపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది రైతులు చెరువులో మోటార్లు, పైపులు ఏర్పాటు చేసుకుని సాగునీటిని వినియోగిస్తూ తమ పంటలను కాపాడుకుంటున్నారు.అయితే గత ఐదేళ్లుగా పరిస్థితి మారింది. బోరుగడ్డ అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఎర్రవంక, వీధులవంక కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో చెరువుకు నీటి ప్రవాహం సరిగా చేరలేదు. నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించి రావాల్సిన వర్షపు నీరు మధ్యలోనే ఆగిపోవడంతో చెరువు పూర్తిగా నిండలేదు. ఫలితంగా రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొన్నారు. బోర్లలో నీటిమట్టం పడిపోయింది. పంటలు తగ్గిపోయాయి. ఉపాధి అవకాశాలు కూడా క్షీణించాయి.ఈ పరిస్థితిని గమనించిన అధికారులు గ్రామస్థులతో కలిసి సమస్య పరిష్కారానికి ముందుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5,83,634 నిధులతో పూడికతీత పనులు మంజూరు చేశారు. గత వారం రోజులుగా ప్రతిరోజూ 180 నుంచి 200 మంది ఉపాధి హామీ శ్రామికులు ఎర్రవంక, వీధులవంక కాలువల్లో పూడికతీత పనులు చేస్తున్నారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ చెరువుకు మళ్లీ జీవం పోస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్న మాటల్లో ఇప్పుడు ఆశ కనిపిస్తోంది.“ఈ పనులు పూర్తయితే దేవరబండ చెరువు మళ్లీ నిండుతుంది. చెరువు నిండితే మా బోర్లలో నీరు పెరుగుతుంది. పంటలు బాగా పండుతాయి. వ్యవసాయ భూమి పెరుగుతుంది. గ్రామంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి” అని రైతులు ఆనందంగా చెబుతున్నారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ… “గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు పునరుద్ధరణ చేయడం అంటే కేవలం పూడికతీత మాత్రమే కాదు… రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం. దేవరబండ చెరువు పనులు పూర్తయితే నాలుగు గ్రామాల రైతులకు సాగునీటి సమస్య చాలా వరకు తగ్గుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా శాశ్వత ప్రయోజనం కలిగించే ఆస్తులను సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం” అని కలెక్టర్ తెలిపారు.
ఒకప్పుడు ఎండిన కాలువలు… ఇప్పుడు కూలీల అడుగులతో కదులుతున్నాయి. ఒకప్పుడు నీటి కోసం ఎదురు చూసిన రైతు కళ్లలో… ఇప్పుడు ఆశల వెలుగు కనిపిస్తోంది. దేవరబండ చెరువు పూడికతీత పనులు కేవలం అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు…“చెరువు బతికితే గ్రామం బతుకుతుంది” అనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం.


