రవీంద్ర పాఠశాలల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలల్లో గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య , విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా జి.పుల్లయ్య విద్యార్థులతో మాట్లాడుతూ మనము ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు మరచిపోకూడదని, మన మాతృభాషను ఎప్పటికీ మరవరాదన్నారు. తేనెలొలుకు భాష మన తెలుగు భాష అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష పై ఉన్న మమకారము చేత సాహిత్యగోష్ఠికై అష్టదిగ్గజకవులను ఏర్పాటు చేసి రాజకవిగా పేరు పొందారన్నారు. ప్రాచీనములో నన్నయాదుల నుండి ఆధునికంలో విశ్వనాథ, గురజాడ, గిడుగు రామమూర్తి, గుర్రం జాషువా, శ్రీశ్రీ, సినారె వంటి ఉద్దండులు తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారన్నారు. అనంతరం అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ మాట్లాడుతూ” ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” గా పిలువబడుతున్న తెలుగు భాష ప్రపంచ భాషల్లో అత్యంత సుందరమైన భాషగా ఉందన్నారు.ఏ భాషలో లేనన్ని ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని గుర్తు చేశారు. మనము ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా మాతృభాషను మరవరాదన్నారు. అనంతరం వైస్ చైర్మన్ జి వంశీధర్ విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్తలు హేమలత, చంద్రశేఖర్,స్వాతితో పాటు తెలుగు భాషాబోధకులు మధు, బాలకృష్ణ, హేమలత, మహేష్, సుజాతలు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది.

