పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది
1 min read
జిల్లా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిoది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. అందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తోందని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 17లక్షల, 12వేల, 516 రూపాయల విలువైన 31 సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, 15లక్షల, 34వేల, 465 రూపాయల విలువైన 9 ఎల్వోసి కాపీలను అనారోగ్యంతో బాధపడుతోన్న బాధితులకు, వారి బంధువులకు టీడీపీ జిల్లా అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. వారికి భరోసా కల్పించారు. ఇప్పటికే పొందిన వైద్య సేవలపై ఆరాతీశారు. అలాగే భవిష్యత్తులో ఎటువంటి వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎదురైనా తాను అండగా ఉంటానంటూ వారికి భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 729 మందికి 5కోట్ల, 71వేల, 519 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే మరోపక్క ముందస్తుగా వైద్య సేవలు పొందేందుకు కూడా 88 మంది అనారోగ్యవంతులకు 2కోట్ల, 42లక్షల, 13వేల, 408 రూపాయల విలువైన ఎల్వోసి కాపీలను పంపిణీ చేశామన్నారు. అదేమాదిరిగా 2లక్షల రూపాయల విలువైన ఫైనాన్సియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా 818 మంది బాధితులకు 7కోట్ల, 44లక్షల, 84వేల, 999 రూపాయల మేర ఆర్ధిక భరోసా కల్పించినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంజీవని కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించిన తీరును ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతోషంగా పంచుకున్నారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు, తదితరులు పాల్గొన్నారు.


