NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనగణన కార్యక్రమాన్ని రెండురోజుల్లోగా పూర్తిచేయాలి

1 min read

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సిద్ధం కావాలి

జలధార పనులలో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు

అధికారులతో జిల్లా కలెక్టర్  కె.వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్లగణనను రెండురోజుల్లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి  సోమవారం జనగణన, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జలధార, 22ఏ కేసుల పరిష్కారం,సంపూర్ణపరిశుద్ధ్యం, యువతకు కౌశలం ద్వారా శిక్షణ,ఉద్యోగకల్పన,తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  జిల్లాలో ఈనెల 25వ తేదీ నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం కానున్న దృష్ట్యా ఇండ్లగణన కార్యక్రమాన్ని రెండురోజుల్లోగా పూర్తిచేయాలని, గణన సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.  జిల్లాలో ఈనెల 25 వతేదీ నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ఇందుకు సంబంధించి షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సూపెర్వైజర్లు, పోలింగ్ బూత్ స్థాయి అధికార్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై శిక్షణ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఈనెల 25వ తేదీలోగా జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్  ఏర్పాటుచేయాలని, ఖాళీగా ఉన్న సూపెర్వైజర్లు, బి.ఎల్.ఓ పోస్టుల వివరాలపై నివేదికను వెంటనే సమర్పించాలన్నారు.  జలధార కార్యక్రమంలో చేపట్టిన పనులు నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని, చేపట్టిన పనులలో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. జలధార ద్వారా చేపట్టే  పనులకు సంబందించి చేపట్టకముందు, చేపట్టిన తరవాత ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు.  జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలోను వర్మీ కంపోస్ట్ యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని, ప్రతీ ఇంటి నుండి తడి, పొడి చెత్తలను తప్పనిసరిగా విడివిడిగా సేకరించాలన్నారు. గ్రామ, పట్టణ  ప్రాంతాలలోని  చెత్త నుండి సంపద కేంద్రాల వద్ద తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారుచేసి రైతులకు అందించాలని   జిల్లా కలెక్టర్ కె .వెట్రిసెల్వి సంబంధిత అధికారులను అదేశించారు  22ఏ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను రికార్డులు, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కౌశలం కార్యక్రమం ద్వారా జిల్లాలోని యువతకు శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించాలని,అభ్యర్థులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ సమాచారాన్ని తెలియజేసి, అభ్యర్థులందరూ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,  ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ,ఆర్డీఓ లు కిషోర్, రమణ, డిపిఓ అనురాధ,వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు,ఎంపిడిఓ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *