NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

647 ఇళ్ల నిర్మాణాలను ఈనెలాఖరుకు పూర్తిచేసి  నిర్వాసితులను తరలించాలి

1 min read

కొత్త ప్రాంతంలో పెన్షన్లు,రేషన్, అన్నదాత సుఖీభవ, తల్లికివందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందేలా  చర్యలు తీసుకోవాలి

ఇంచార్జ్  జిల్లా కలెక్టర్ డా: ఎం.జె.అభిషేక్ గౌడ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:తాడువాయి లో నిర్మిస్తున్న పునరావాస  కాలనీలోని  647 ఇళ్ల నిర్మాణాలను ఈనెలాఖరుకు పూర్తిచేసి  నిర్వాసితులను తరలించాలని, పునరావాస  కాలనీకి తరలించే వారికి కొత్త ప్రాంతంలో పెన్షన్లు, రేషన్, అన్నదాత సుఖీభవ, తల్లికివందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందేలా  చర్యలు తీసుకోవాలని   ఇంచార్జ్  జిల్లా కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ  అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై  స్థానిక కలెక్టరేట్ లో   శనివారం  అధికారులతో  ఇంచార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డా. అభిషేక్ గౌడ  మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల పూర్తిపై ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నిర్వాసితులందరినీ  దశలవారీగా  డిసెంబర్ లోగా  కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం  తాడువాయి లో నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీలో ఈనెలాఖరుకు 647 మంది  నిర్వాసితులను  తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులు ఇళ్లలో నివసించేందుకు వీలుగా  ప్రతీ ఇంటికి త్రాగునీరు, విద్యుత్, కాలనీలో  రోడ్లు, డ్రైనేజి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు  వంటి మౌలిక సదుపాయాలు ముందుగానే ఏర్పాటుచేయాలన్నారు.  సెప్టెంబర్ నెల నుండి డిసెంబర్ వరకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం జిల్లా చింతూరు కు చెందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఏలూరు జిల్లాలో పునరావాస ఇళ్లను మంజూరు చేశారని,  వారిని వారికోసం నిర్మించే  పునరావాస కాలనీలకు వారిని తీసుకువచ్చి   ఇళ్లను వారికి చూపించి, వారు సంతృప్తి చెందిన అనంతరం ఇళ్లకు విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాధమిక  సౌకర్యాలు పూర్తిగా ఏర్పాటుచేసి, వారు త్వరితగతిన  గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం,  భూమికి భూమి పరిహారం అంశాలలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్,   గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, ట్రాన్స్కో ఎస్ఈ కె. ఎం. అంబేద్కర్ ,  భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author