జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత
1 min read
జిల్లా వ్యాప్తంగా 2,155 మంది పోలీసులతో పటిష్ట భద్రత.
ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా… అదనపు బలగాల మోహరింపు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: … కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్
కర్నూలు, న్యూస్ నేడు: రేపు కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసిందని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బుధవారం తెలిపారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు 4 సబ్ డివిజన్ల పరిధిలలో ఎన్నికలు జరగనున్నాయి.94 అత్యంత సమస్యాత్మక, 162 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామన్నారు.
భద్రతా బలగాల మోహరింపు – ప్రత్యేక నిఘా: అనుమతి లేని వాహనాల్లో తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామన్నారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు: ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అనుమతి లేకుండా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సోషల్ మీడియాపై నిఘా.
వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, తప్పుడు ప్రచారం చేసినా, పుకార్లు వ్యాప్తి చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.


