రాయలసీమ యూనివర్సిటీ లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ (VBYP) కార్యక్రమం యూనివర్సిటీలో ఉత్సాహభరితంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన యువతీ యువకులు “ఒకే దేశం – ఒకే ఎన్నిక” (One Nation, One Election) అనే అంశంపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను సభలో వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయ కుమార్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం యూత్ పార్లమెంట్ కార్యక్రమం ద్వారా యువతకు తమ ఆలోచనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వేదికను కల్పించడం అభినందనీయమన్నారు. దేశ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై యువత అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత తమ అభిప్రాయాలను ధైర్యంగా, నిర్మాణాత్మకంగా వెల్లడించాలని కోరారు.తదుపరి ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ బెటాలియన్ DSP మహబూబ్ బాషా మాట్లాడుతూ, యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సమాజంలోనూ, స్నేహితుల మధ్యనూ దేశం ఎలా ఉండాలి, నాయకులు ఎలా వ్యవహరించాలి, పాలనలో ఎలాంటి మార్పులు రావాలి అనే అంశాలపై చర్చించడమే కాకుండా, ఇటువంటి వేదికలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచాలని సూచించారు..కార్యక్రమం ముగింపులో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేయడంతో పాటు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతీ, యువకుడికి పాల్గొన్నందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమం యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, జాతీయ అభివృద్ధిపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడింద మై భారత్ జిల్లా యువజన అధికారి శ్రీ ఐజయ్య తెలిపారు.


