NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

1 min read

కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి

ఎన్నికల నియమావళి, కౌంటింగ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో శనివారం నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు నిర్దేశిత నిబంధనల ప్రకారం అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నిరంతరం కొనసాగించాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు, ధ్రువీకరణ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *