NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

1 min read

ప్రజలంతా చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి

మంత్రులు, ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు

ప్రతి 2 గంటలకోసారి ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు

ప్రధానమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం

మొంథా తుపాను ముందస్తు చర్యలపై మంత్రి నారా లోకేష్

అమరావతి, న్యూస్​ నేడు : మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హోంమంత్రి అనితతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…. తుపాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఒకపక్క డిజాస్టర్ మేనేజర్ మెంట్ మంత్రి అనిత గారు, మరోవైపు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను సమన్వయంతో గత 24గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. గత ఐదు రోజులుగా మొంథా తుపాను గమనాన్ని పరిశీలిస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నాం. ఈ రోజు రాత్రి 11.30 గం.లకు అమలాపురం సమీపంలో తుపాను తీరం దాటబోతోంది. ఈ సందర్భంగా 90 నుంచి 100 కి.మీల వేగంతో అక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

1906 తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. యుఏఈకి వెళ్లే ముందు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత 12 రివ్యూ మీటింగ్ లు, టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా తుపాను పరిస్థితులపై  సమీక్ష చేశారు. ప్రధాని నరేంద్రమోడీ సీఎంతో మాట్లాడి ముందస్తు ఏర్పాట్లపై వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రియల్ టైమ్ రిపోర్టులు పంపించింది. రాష్ట్రానికి ఏం కావాలన్నా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి చెప్పారు. తుపాను ప్రభావం, ముంపు తీవ్రత అధికంగా ఉండే 1,328 గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3,465 గర్భిణీలను తరలించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేస్తున్నాం.  1,906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటుచేసి పునరావాసానికి అవసరమైన సామగ్రి అంతా పంపించాం. శానిటేషన్ కు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, లైమ్, ఇతర సామగ్రిని ఆయా గ్రామాలకు చేరవేశాం.

ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం

14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం, 364 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాం. ఈ నెల 29వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసి, నిషేదాజ్ఞలు విధించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 11 ఎన్ డీఆర్ఎఫ్, 12 ఎస్ డీఆర్ ఎఫ్ టీమ్ లు, రిజర్వ్ టీమ్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రావడానికి ఆర్మీ కూడా హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. 145 ఉడ్ కటింగ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన చోట వారు సేవలందిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి 325 శిబిరాలు సిద్ధం చేశాం, 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సహాయ చర్యల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 99 శాతం కచ్చితత్వంతో మాకు సమాచారం అందుతోంది. రియల్ టైం సమాచారాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ప్రధానిమంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పీఎంఓ వారు కూడా మానిటర్ చేస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులంతా తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ రకాల సోర్స్ ద్వారా డేటా సేకరిస్తున్నాం. శాటిలైట్ మ్యాప్స్ కూడా తీసుకుంటున్నాం. ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యం తేవడమే మా లక్ష్యం. ఇది రాజకీయాలకు సమయం కాదు. ప్రజలకు సేవలందించేందుకు అన్నిశాఖలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.

About Author