మహిళగా పుట్టినందుకు మనం గర్వపడాలి
1 min read

పిల్లల చదువు చాలా ముఖ్యం, వారిని విద్యావంతులను చేయండి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : మహిళగా పుట్టినందుకు మనమందరం గర్వపడాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మహిళల నుద్దేశించి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఈ వేదికపై ఉండటానికి కారణమైన తన తల్లికి మరియు అక్కడే ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, గత 8 నెలల్లో 83 బాల్య వివాహాలను ఆపామని కలెక్టర్ తెలిపారు. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబమంతా బాగుంటుందని, మహిళలకు ఉన్న శక్తి అపారమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు తల్లే మొదటి దైవమని, ఆడపిల్లలను బాగా చదివించి, వారు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు పెళ్లిళ్లు చేయవద్దని కలెక్టర్ తల్లులకు తెలిపారు. అదే విధంగా కొడుకులకు ఆడపిల్లలను గౌరవించడం నేర్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఏ విధంగా అండగా నిలుస్తుందో వివరించారు. SHG బ్యాంక్ లింకేజ్ కింద సుమారు 1,30,000 మంది మహిళలకు 1200 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్త్రీ నిధి కింద 25,341 మంది మహిళలకు 195 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారన్నారు. ఉన్నతి మరియు PM అజయ్ కింద 208 స్వయం సహాయక బృందాలకు 176 కోట్ల రూపాయల మద్దతు లభించిందన్నారు. ఉన్నతి పథకం కింద 1698 మంది మహిళలకు 8.5 కోట్ల రూపాయల సాయం అందిందన్నారు. ఇతర పథకాలైన CIF, VGF, VRF మరియు PMEGP వంటి వివిధ పథకాల ద్వారా వేలాది మంది మహిళలకు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయన్నారు. మెప్మా (MEPMA) కి సంబంధించి 4502 స్వయం సహాయక బృంద సభ్యులకు 613 కోట్ల రూపాయలతో ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. PMFME పథకం కింద మహిళా యూనిట్ల సంఖ్యను పెంచాలని, తద్వారా ఎక్కువ మంది మహిళలు ప్రయోజనం పొందేలా చూడాలని కలెక్టర్ ఎల్ డి ఎం ను ఆదేశించారు. మొత్తం మీద సుమారు 1,62,782 మంది మహిళలకు 2200 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
వసతి గృహాలు కావాలని కోరుతున్నారని ఇప్పటికే చాలా వరకు సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, మైనారిటీ హాస్టళ్లు ఉన్నాయని, అయినప్పటికీ సోషల్ వెల్ఫేర్ 7 హాస్టళ్లు, బిసి వెల్ఫేర్ లో 4 హాస్టళ్లు, అలాగే కేజీబీవీ (KGBV) కింద 12 కొత్త హాస్టళ్లు కావాలని ప్రభుత్వాని కోరడం జరిగిందన్నారు. ఇదే కాకుండా సీజనల్ హాస్టళ్లు కూడా మనం ఈ సంవత్సరం 78 ఓపెన్ చేసుకున్నామని ఇందులో 4,000 మంది పిల్లల్ని మనం చదివించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళ్లేటప్పుడు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లడం వల్ల వారి చదువు ఆగిపోతుందని, వారికి సీజనల్ హాస్టళ్లలో ఉంచి చదివించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కేవలం 57% అక్షరాస్యత మాత్రమే ఉందని, అక్షరాస్యత ను ఇంప్రూవ్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ‘అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందులో మిగతా అన్ని జిల్లాలు కలిపి దాదాపు 18-19 లక్షల మంది రిజిస్టర్ అయితే, మన జిల్లా ఒక్కటే 1,61,000 మంది మహిళలను, వృద్ధులను ఆ ప్రోగ్రామ్ లో చేర్చిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 నెలల పాటు చదువు నేర్చుకున్నారన్నారు. వారికి ప్రీ-ఫైనల్ టెస్ట్ కూడా ఇటీవలే జరిగిందన్నారు. అందులో 94% మంది పాస్ అయ్యారన్నారు. దీనివల్ల మన జిల్లా అక్షరాస్యత శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఓర్వకల్లులో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని చదివించాలని కలెక్టర్ కోరారు.పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదు, జీవం లేదు, స్త్రీ లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం అన్నారు. ఎప్పుడైతే స్త్రీని గౌరవిస్తారో, అటువంటి సమాజమే అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యంగా మన సంప్రదాయంలో స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్నారు. అటువంటి స్త్రీ పట్టుదల, ఓర్పు, సహనం మరియు త్యాగాలను మనం ఎప్పుడూ మరువకూడదన్నారు. ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది ఎంత సత్యమో, ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండటం కూడా అంతే నిజం అన్నారు. రాజకీయాల్లో గ్రామ స్థాయి వార్డు సభ్యుల నుండి పార్లమెంటు స్థాయి వరకు మహిళలు రాణిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో పొదుపు ఉద్యమాన్ని (డ్వాక్రా – DWCRA) ప్రారంభించారన్నారు. ప్రతిరోజూ రూపాయి, నెలకు 30 రూపాయలు పొదుపు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారన్నారు. దీనివల్ల కుటుంబ బాధ్యతల్లో భర్త సంపాదనతో పాటు మహిళలు కూడా తోడ్పడే అవకాశం కలిగిందన్నారు. ఓర్వకల్లు మండలం డ్వాక్రా సంఘాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అవార్డును గెలుచుకోవడం చాలా గర్వకారణం అన్నారు. ఒకప్పుడు నెలకు 30 రూపాయలు పొదుపు చేసిన మహిళలు, ఈరోజు 1000 రూపాయల వరకు పొదుపు చేసే స్థాయికి ఎదిగారన్నారు. వారు వ్యాపారాలు చేస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ మంచి పొజిషన్‌లో ఉంచారన్నారు. మన ప్రభుత్వం మహిళల విద్య, ఆరోగ్యం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా (Entrepreneur) ఎదగాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. ఓర్వకల్లు మండలంలో MSME (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ‘దిలీప్’ అనే సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ సంస్థ మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రుణాలు మరియు వ్యాపార సలహాలను అందిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, సమాజంలో ఇంకా బాల్య వివాహాలు, అత్యాచారాలు మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. మహిళలు ముఖ్యమంత్రులుగా , ప్రధానమంత్రులుగా , మరియు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని నడిపించారన్నారు. విద్యా రంగంలో గొప్ప డాక్టర్లుగా, సైంటిస్టులుగా, చీఫ్ సెక్రటరీలుగా అత్యున్నత పదవులను అధిరోహించారన్నారు.. మహిళలు క్రమశిక్షణతో కష్టపడి ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపితమైందన్నారు. ఇటీవల వచ్చిన UPSC ఫలితాల్లో కూడా టాప్ ర్యాంకర్లలో మహిళలే ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ పట్టుదల, ఓర్పు, సహనం మరియు త్యాగాలను మనం ఎప్పుడూ మరువకూడదన్నారు. ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది ఎంత సత్యమో, ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండటం కూడా అంతే నిజం అన్నారు. రాజకీయాల్లో గ్రామ స్థాయి వార్డు సభ్యుల నుండి పార్లమెంటు స్థాయి వరకు మహిళలు రాణిస్తున్నారన్నారు. అనంతరం డి.ఆర్.డి.ఏ, మెప్మా ద్వారా వివిధ పథకాల కింద లబ్ధిదారులైన దాదాపు లక్షా అరవై రెండు వేల మందికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,201 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందించారు. డిఆర్డిఏ, మెప్మా మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ, డి ఆర్ ఓ సి. వెంకట నారాయణమ్మ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ సావిత్రి , వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రిక , వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మీ , బొందిల్ల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయ భారతి, డి ఆర్ డి ఏ పిడి రమణారెడ్డి, జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.


