జూన్ 5న వసతి గృహాలలో మొక్కలు నాటే కార్యక్రమం
1 min read
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం నెరవేరాలి
నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌ల ఏర్పాటుకు కృషి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా జూన్ 5న మొక్కలు నాటడం , నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల అమలు , నెట్ జీరో హెల్తీ క్యాంపస్ సంబంధిత అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని గురుకుల విద్యాసంస్థలు , సంక్షేమ వసతి గృహాలలో మరియు విద్యా సంస్థలను పర్యావరణమునకు హిత కేంద్రాలుగా మార్చడానికి కృషి చేయాలని తెలిపారు. నెట్ జీరో ఎనర్జీ లక్ష్యంతో నెడ్‌క్యాప్ ద్వారా సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటు ద్వారా సొంతంగా విద్యుత్ తయారు చేసుకునే చర్యలు త్వరగా పూర్తి చేయాలని , పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచాలని సూచించారు. మియావాకి విధానంలో హైడెన్సిటీ మరియు అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్‌లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పావు ఎకరా (25 సెంట్లు) విస్తీర్ణంలో ఏడు లేయర్ల విధానంలో 750 ఔషధ మొక్కలు , 750 గుబురు పొదల మొక్కలు , 100 అతిపెద్ద మొక్కలు ,150 సాధారణ మొక్కలు ఈ విధంగా సుమారు 1625 మొక్కలను డి డబ్ల్యూ ఎం ఏ గుర్తించిన 13 విద్యా సంస్థలలో వివిధ పండ్ల రకాల మొక్కల తో కూడా జూన్ 5న నాటే చర్యలు తీసుకోవాలని పిడి నరసింహారెడ్డిని ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశానికి డ్వామా పీడీ నర్సింహారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక , బీసీ వెల్ఫేర్ ప్రసూన , ట్రైబల్ వెల్ఫేర్ సురేష్ ,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ , కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్ , అడిషనల్ కమిషనర్ కృష్ణ , మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రఘు , డిపిఓ భాస్కర్ , నేడ్ క్యాప్ డి. ఓ. వీరేంద్ర , ఏపీఆర్జేసీ కోఆర్డినేటర్, నెట్ జీరో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు గంగాధర్ మరియు పద్మావతి , సంబందించిన అధికారులు పాల్గొన్నారు.

