తుంగభద్ర డ్యాం నుంచి రైతులకు సాగునీరు విడుదల చేయాలి
1 min read
రైతుల ఇబ్బందులపై అధికారులు తక్షణమే స్పందించాలి – ఎస్‌డీపీఐ డిమాండ్
హొళగుందన్యూస్ నేడు: తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రైతులకు అవసరమైన స్థాయిలో సాగునీరు అందకపోవడం తీవ్ర ఆందోళనకరమని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకులు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి ఆంధ్రప్రదేశ్ రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో సుమారు 92 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఎస్‌డీపీఐ నాయకులు తెలిపారు. ఇటీవల జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొన్నప్పటికీ, నీటి విడుదల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.కర్ణాటక వాటాకు సంబంధించిన నీటిని విడుదల చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ వాటాకు సంబంధించిన నీటిని విడుదల చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని తెలిపారు. ఈ కారణంగా కర్ణాటకకు చెందిన రైతులు తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ కాలువలో 158వ కిలోమీటర్ వద్ద, హల్వారీ మండలం సిందెవలం గ్రామం సమీపంలో నీటిని అడ్డుకున్నారని పేర్కొన్నారు.ఆ ప్రాంతంలో నీటిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించగా, ఆంధ్రప్రదేశ్ అధికారులు తమ వాటాకు సంబంధించిన నీటిని విడుదల చేయకపోవడంపై స్పష్టమైన స్పందన ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎస్‌డీపీఐ నాయకులు తెలిపారు. ఈ సమయంలో సాగునీరు అందకపోతే పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర డ్యాం నుంచి ఆంధ్రప్రదేశ్ రైతుల వాటాకు సంబంధించిన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నీటి విడుదలపై అధికారులు ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని, తుంగభద్ర కాలువకు నిరంతరాయంగా నీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రైతుల మధ్య ఏర్పడిన నీటి సమస్యకు అధికార యంత్రాంగం చొరవ తీసుకుని పరిష్కారం చూపాలని, కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని ఎస్‌డీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. రైతులు రోడ్డెక్కి, నీటి కోసం ఆందోళన చేసే పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించాలని సూచించారు.రైతుల పంటలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, సాగునీటి విషయంలో జాప్యం చేస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ నీటిని సక్రమంగా వినియోగించి రైతుల పంటలకు సాగునీరు అందించాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, తుంగభద్ర బోర్డు, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్ రైతులకు వారి వాటా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ఎస్‌డీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్,అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షులు కే. సలం, కోశాధికారి అల్లా బకాష్, ముల్లా అమీన్, ముల్లా ఆయూబ్, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.


