మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
1 min read
స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎన్నికల సామగ్రి భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నందికొట్కూరు, న్యూస్ నేడు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ హాళ్లలో అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏర్పాటును పర్యవేక్షించాలని సూచించారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సామగ్రి భద్రపరిచే గదుల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్‌ల నిర్వహణ చేపట్టాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించేలా చూడాలని తెలిపారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియలోని ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఆరు అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


