సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతుల కరువు…
1 min read
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతుల కరువు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు బలరాం యాదవ్_
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బలరాం యాదవ్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేద, బడుగు, బలహీన తరగతుల విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరచాల్సిన సామాజిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతోంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అనేక హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఎస్సీ, బీసీ బాలురు మరియు బాలికల కోసం నడుస్తున్న ప్రీమెట్రిక్ హాస్టళ్లలో శానిటేషన్, భద్రత, భోజన సదుపాయాలు, బిల్డింగ్ పరిస్థితులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ ప్రకటనలు చేసినప్పటికీ, అవి కేవలం కాగితాల పరిమితంగా మిగిలిపోయాయని విమర్శించారు.బీసీ బాలికల వసతి గృహంలో అధిక అడ్మిషన్లతో విద్యార్థులు ట్రంకులపై నిద్రించాల్సిన దుస్థితి తలెత్తింది. ఇది విద్యార్థుల హక్కులపై ఘోరమైన ఉల్లంఘన,” అని మండిపడ్డారు.వంటమనుషులు, వాచ్మెన్, కుక్కుల పోస్టులు ఖాళీగా ఉండడంతో హాస్టల్లో భోజన తయారీ, భద్రత, పరిశుభ్రత పూర్తిగా గల్లంతయ్యాయని తెలిపారు. ఒకే ఒక్క వంటమనిషి అన్ని పనులు చేస్తూ పడుతున్న కష్టాలను హృదయవిదారకంగా వర్ణించారు.ఈ నేపథ్యంలో వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని హాస్టళ్లలో కనీస వసతులు — మరుగుదొడ్లు, మంచాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం — పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తగిన భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసి నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక మానిటరింగ్ కమిటీని నియమించాలని సూచించారు.టీడీపీ కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా ఒక్క నియామకం కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీని మూలంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. “ఇది విద్యార్థులపై ప్రభుత్వం చూపిన అనాసక్తికి స్పష్టమైన నిదర్శనం,” అని ధ్వజమెత్తారు.గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో హాస్టళ్ల పరిస్థితులు మెరుగుపడినదాన్ని గుర్తుచేసిన ఆయన, నేటి ప్రభుత్వం కూడా అదే స్థాయికి తీసుకురావాలంటే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. “విద్య అనేది విద్యార్థుల హక్కు. ప్రతి పేద విద్యార్థి కూడా సమానమైన విద్యను పొందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి” అని హెచ్చరించారు.ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం తరఫున ఆయన డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమ మార్గం తప్పదని హెచ్చరించారు.

