ఐక్యతతో.. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
1 min read

సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్ జుబైదా బేగం
- రైల్వే స్టేషన్ లో ట్రాఫికింగ్ వ్యతిరేకం పై అవగాహన..
కర్నూలు, న్యూస్ నేడు: మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని , ఐక్యతతోనే అంతమొందించవచ్చన్నారు సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్ జుబైదా బేగం. బుధవారం ” . వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ సందర్భంగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో “యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్” ప్రాజెక్టు కింద కోనేర్ (CONARE) సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సి డబ్ల్యూ సి ఛైర్పర్సన్ జుబైదా బేగం మాట్లాడుతూ ట్రాఫికింగ్ అనేది ఒక సంఘటిత నేరంగా వర్ణించారు, “బాధితులను రక్షించేందుకు, సమాజం చేతులెత్తేయకూడదు. మానవ అక్రమ రవాణాను పూర్తిగా అంతమొందించేందుకు ఐక్యంగా పని చేయాలి” అన్నారు. అనంతరం కర్నూలు రైల్వేస్టేషన్ స్టేషన్ మాస్టర్ శేషపాణి, ఆర్పీఎఫ్ సీఐ రామ్ మోహన్, హెల్త్ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాలలో ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల సమాచారం 139, 1098 లేదా 100 నంబర్లకు తెలియజేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్టు జిల్లా కో ఆర్డినేటర్ మౌనిక , సీడబ్ల్యూసీ మెంబర్ మధుసుధాకర్, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మున్నాజి రావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ శేషన్న, సమీర్, జీఆర్పీ రైటర్ మాధవ్ స్వామి, చైల్డ్ హెల్ప్‌లైన్ -1098 ఇంచార్జ్ సుంకన్న, డీసీపీయూ సభ్యులు నాగేశ్వరరావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

