ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి
1 min read

ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు.
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనము నిమిత్తం వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఉరుకుంద ఈరన్న స్వామి తమ ఇంటి దేవుడని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే స్వామి క్షమించే ప్రసక్తే లేదని వివరించారు. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, మహానంది ,అహోబిలం నరసింహస్వామి వంటి ఆలయాలు నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం, మంత్రాలయం ఆలయాలు తోపాటు మరో రెండు మూడు ఆలయాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని 100 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు సంవత్సరాల ప్రణాళికతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును టీజీ కోరారు. ఇక్కడ తిరుమల తిరుపతి తరహాలో విశాలమైన భోజనశాల నిర్మించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. భక్తులు ఎండకు, వానకు తడవకుండా, అలాగే దోమల బెడద లేకుండా వారికి వసతి కల్పించేలా రెండు పెద్ద హాల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీటితో పాటు భక్తులు స్వామివారి దర్శనం అనంతరం రాత్రి ఇక్కడ ఉండేలా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాగే స్వామివారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో రహదారులను అభివృద్ధి చేయాలని ఆయన టీజీ కోరారు. తన కుమారుడు టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని ,ఆయన ద్వారా ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు.

