పెదవేగిలో మహిళల చట్టాల పై న్యాయ విజ్ఞాన సదస్సు
1 min readసమాజంలో ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్
ఉచిత న్యాయ సహాయం కై 15100 డయల్ చేయండి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అధ్యక్షతన శనివారం పెదవేగి గ్రామంలోని ఎంపీడీవో ఆఫీస్ నందు “విధాన్ సే సమాధాన్ ( చట్టంతో పరిష్కారం) ఫర్ ఉమెన్ బ్లాక్ లెవెల్ -2” మహిళ చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే రత్న ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళా చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యముతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ సంయుక్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాయని, ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు అలాగే వారి రక్షణ కొరకు ఏర్పాటు చేసిన చట్టాల పైన అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు.ఈ సదస్సు నందు గృహింస, వరకట్న వేధింపులు, బాలికల పైన లైంగిక వేధింపుల నిరోధ చట్టం,మరియు బాధితులకు పరిహారము అంశాల పైన అవగాహన కల్పించారు. నేటి సమాజంలో సైబర్ నేరాలు పెరిగాయని మొబైల్ ఫోన్లను తగు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు అలాగే ఎటువంటి ఉచిత న్యాయ సహాయం కై 15100 కి కాల్ చేసిన ఎడల తక్షణ సంబంధిత అధికారులు స్పందించి న్యాయ సహాయం అందిస్తారని, అలాగే జిల్లా అధికార సంస్థ ఏలూరు వారితో పాటుగా అన్ని కోర్టుల పరిధిలో మండల న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయము లేదా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసులను వాదించటం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా కోర్టు పరిధిలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా నేరము మోపబడిన అర్హులైన వారందరికీ ఉచితముగా కేసులు వాదించడం జరుగుతుందని తెలియజేశారు, మారుమూల నివసిస్తున్న ప్రతి మహిళకి చట్టాల పైన అవగాహన కలిగించటం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎ.పి. వుమెన్ కమిషన్ మెంబర్ బి. వినీత, న్యాయవాదులు జి. మేరీ సునీత, తిగిరిపల్లి సుబ్బారావు, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొనే సీతారాం,పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రావు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. వి.ఎన్. మునీశ్వరరావు మరియు డిసిపిఓ సూర్య చక్రవేణి తదితరులు పాల్గొన్నారు.