NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి ప్రేమికులకు ఉచితంగా మొక్కల పంపిణీ

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్

ఆసక్తిగల వారు సచివాలయాల్లో వివరాలు నమోదు చేయాలి

సెప్టెంబర్ 20న కార్పొరేషన్ కార్యాలయం, శానిటేషన్ డివిజన్లలో మొక్కల పంపిణీ

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం కర్నూలు నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా “హరిత ఆంధ్ర” పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతి ఇంటి మేడపై, అపార్టుమెంట్ల బాల్కనీలలో మొక్కలు, పండ్ల చెట్లు, కూరగాయలు పెంచే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఆసక్తిగల వారు తమ వివరాలను సంబంధిత సచివాలయ పరిధిలోని శానిటేషన్ కార్యదర్శుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదైన తోటలను శానిటేషన్ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పరిశీలించి ఉత్తమమైన వారిని ఎంపిక చేస్తారని తెలిపారు.ఈ నెల 20న నగరపాలక సంస్థ కార్యాలయం మరియు 16 శానిటేషన్ డివిజన్లలో పచ్చ సుంకేసుల/పెల్టోఫోరం, గుల్మోహర్/ఎర్ర సుంకేసుల, కొండతంగేడు, గంగరావి, సీతాఫలం, తపస్సి, కానుగ, జామ, వేప వంటి తొమ్మిది రకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ప్రతి గృహం, కార్యాలయం, పాఠశాల, హాస్టల్ ఒక తోటగా మారితే, కర్నూలు నిజమైన స్వచ్ఛ హరిత నగరంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ సంస్థలు తమ పరిసరాలను హరిత ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనలో స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కమిషనర్ కోరారు .

About Author