అమరావతి వెళ్లే మెగా డీఎస్సీ అభ్యర్థులకు చక్కని సౌకర్యాలు కల్పించాలి
1 min read

అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మెగా డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా నియామక పత్రాల స్వీకరణకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చక్కని వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్లో మంగళవారం మెగా డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు అమరావతికి ప్రయాణ ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మెగా డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25వ తేదీన వెలుగుపూడిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారని, ఈ కార్యక్రమానికి అభ్యర్థులను తీసుకువెళ్లేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ లో 1063 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, జోనల్ పోస్టులకు సంబంధించి ఈ జిల్లా వాసులు 83 మంది ఉన్నారని, మొత్తం 1146 మంది అభ్యర్థులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారని, వారికి ఈనెల 25 వ తేదీన అమరావతి లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులతో పాటు మరో మనిషి తోడుగా ఉండేలా ఏలూరు నుండి అమరావతి తీసుకువెళ్లి,తిరిగి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు, వారిని అనుసరించేవారికి ఏలూరులో వారికి బస చేసేందుకు ఏర్పాట్లు చేయాలనీ 24వ తేదీ రాత్రి భోజన సదుపాయం,25వ తేదీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించి కార్యక్రమానికి తీసుకువెళ్లాలని,అనంతరం కార్యక్రమం పూర్తి ఐన తరువాత తిరిగి ఏలూరు తీసుకురావాలన్నారు. ఇందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలనీ,ప్రతీ బస్సుకు ప్రత్యేక అధికారిని నియమించి,వారి పర్యవేక్షణలో ఏర్పాట్లు జరగాలన్నారు.ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.అభ్యర్థులు రిసీవింగ్ సెంటర్ కు హాల్ టికెట్,కాల్ లెటర్,ఆధార్, ఫోటో తీసుకురావాలని, అభ్యర్థితో పాటు వచ్చే వ్యక్తులు ఆధార్ కార్డు,ఫోటో తీసుకురావాల్సి ఉంటుందన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ అభ్యర్థులు, అభ్యర్థులతో పాటు వచ్చే కుటుంబ సభ్యుల పేర్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి ఏలూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, బుధవారం రాత్రి బస చేసేందుకు భోజన ఏర్పాట్లు, గురువారం ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజన ఏర్పాటుచేయడం జరుగుతుందని, అభ్యర్థులు బుధవారం బసకు సంబంధించి దుప్పట్లు,తదితర సామాను తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, సమగ్ర శిక్షా ఏపిఓ పంకజ్ కుమార్,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా:పి.జె.అమృతం,జిల్లా ప్రజారవాణాధికారి ఎస్.కె. షబ్నమ్,డిఎస్పీ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ గాయత్రి, ప్రభృతులు పాల్గొన్నారు.


