పాత్రికేయుల హక్కులను కాలరాస్తే సహించం..
1 min read

నిజాలు రాస్తే అక్రమ కేసులా
అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి
వామపక్ష నాయకుల డిమాండ్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: పాత్రికేయుల హక్కులను కాలరాస్తే సహించమని నిజాలను నిర్భయంగా రాసే పాత్రికేయులపై అక్రమంగా కేసులను పెట్టి బెదిరించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మన్సూర్,సీపీఐ (ఎం ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.కూటమి ప్రభుత్వం విక్రయిస్తున్న నకిలీ మద్యంపై కథనాలు రాసిన సాక్షి మీడియాపై చేస్తున్న కుట్రలను నిరసిస్తూ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు నాగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు.మీడియాపై కేసుల సిగ్గు సిగ్గు పాలన మాకొద్దు అంటూ నినాదాలు చేశారు.కూటమి ప్రభుత్వం నిరంకుశ విధాన వైఖరి నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేపదే నోటీసులు ఇవ్వడం అంటే మీడియా గొంతు నొక్కడమే నని పాత్రికేయుల హక్కులను కాల రాయడం దారుణమన్నారు.పత్రికా స్వేచ్ఛను హరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వార్తలు రాసే పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం విడ్డూరంగా ఉందన్నారు.రాజ్యాంగ హక్కుల ఉల్లంఘించి పాత్రికేయులకు పదేపదే నోటీసులు ఇవ్వడం జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమేనని స్పష్టం చేశారు.ఒక్క కేసులోనే నాలుగైదు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఈనాటి వరకు ఎక్కడ చూడలేదన్నారు.నకిలీ మద్యంపై రాసిన కథనాలకు ఆధారాలు చూపాలంటూ సమాచారం ఇచ్చిన సోర్స్ సహా రాసిన విలేకరుల పేర్లు చెప్పాలని తీసుకొస్తున్న ఒత్తిళ్లకు సాక్షి మీడియా భయపడదని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలను న్యాయస్థానాల ద్వారా తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.అరాచకాలను ఎదుర్కొనేందుకు ప్రజా సంఘాలు జర్నలిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆది, మరిస్వామి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగించడం తగదు అన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం సబబు కాదన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జబ్బార్,లడ్డు,చరణ్, గోవిందరెడ్డి,విజ్జి,రవి,ప్రజా సంఘాల నాయకులు గాబ్రెల్, బీబీ,ఏపీయూడబ్ల్యూజే నాయకులు గోపి,నరేష్, వెంకటేష్,ఆంజనేయులు, భూషణం,మౌలాలి,పరమేష్ సోమన్న ప్రభ విలేఖరి సామన్న పక్కిరయ్య,జలీల్ రైతు సంఘం అధ్యక్షుడు గాబ్రెల్ మాల మహానాడు తాలూకా నాయకులు పబ్బతి శివ పాల్గొన్నారు.

