రోడ్డున పడనున్న నాపరాయి గని కూలీలు..
1 min read

రాయల్టీ ప్రైవేట్ పరం నుండి నాపరాయిని మినహాయింపు ఇవ్వాలి:ఏఐటియుసీ
మిడుతూరు , న్యూస్ నేడు: రాయల్టీని ప్రైవేట్ పరం చేయడంతో నాపరాయి రంగం కుదేలు అవుతుందని గనులను ప్రైవేటుపరం చేయడంతో పనిచేస్తున్న కూలీలు,యజమానుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయని నంద్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వి రఘురాం మూర్తి అన్నారు.ప్రభుత్వం రాయల్టీని ప్రైవేట్ పరం చేయడంతో నాపరాతి గనుల యజమానులు, కూలీలు పరిస్థితి అమ్మకాలు లేకపోవడంతో దయనీయంగా మారిందని,ప్రైవేట్ రాయల్టీ నుండి నాపరాయికి మినహాయింపును ఇచ్చి నాపరాతి గనుల కార్మికులు, యజమానులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సోమవారం మండల కేంద్రమైన మిడుతూరులో నాపరాయి గనుల యజమానులు కార్మిక ఐక్య కార్యాచరణ మండల కమిటీ కన్వీనర్ శ్రీనివాసులు,కో కన్వీనర్ శ్రీధర్ రెడ్డి,వలి ఆధ్వర్యంలో నాపరాయి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పరం చేయడంతో ఒక టన్ను సరఫరాకి రూ 220 చెల్లించాల్సి వస్తుందని, హైదరాబాద్ కు చెందిన సుధాకర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన వాళ్లు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో నాపరాతి గనుల మీద అధిక భారం పడుతుందని,ఇప్పటికే డీజిల్,పెట్రోల్ రేట్లు అధికంగా ఉండడంతో ట్రాన్స్ పోర్ట్ ఖర్చు అధికం అవుతుందని అన్నారు.ప్రైవేట్ వల్ల నష్టపోయేది దినసరి కూలీలు పనిచేస్తున్న పేద,మధ్యతరగతి కుటుంబాల ప్రజలేనన్నారు.నాపరాయి లోడింగ్ అన్ లోడింగ్ హమాలీలుగా,నాపరాయి ఫ్యాక్టరీల్లో పాలిష్ కార్మికులుగా,లారీ,ట్రాక్టర్ డ్రైవర్లుగా తమ రెక్కల కష్టంతో జీవనం సాగిస్తున్న వారి జీవితాలు దుర్భరంగా మారే పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో పీరు సాహెబ్ పేట,నాగలూటి గ్రామాలకు చెందిన గని కార్మికులు యజమానులు రామకృష్ణ,వీరస్వామి,సుభాన్ పాల్గొన్నారు.

