వలసల నివారణ లో అధికారులు విఫలం..
1 min read

ఉపాధి కూలీల పెండింగ్ బకాయిలు చెల్లించాలి….
అధికారుల నిర్లక్ష్యంపై కార్యాలయం ముందు బైఠాయింపు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు.. బి.వీరశేఖర్
పత్తికొండ, న్యూస్ నేడు: మండలంలో తీవ్రమైన అతివృష్టి అనావృష్టి పరిస్థితుల రీత్యా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక, గ్రామీణ పేదలు సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని వలసల నివారణలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డి వీరశేఖర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో బి వీరశేఖర్ మాట్లాడారు. తక్షణమే గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్ డిమాండ్ చేశారు. మండలంలో సరైన పనులు లేక కుటుంబాలు గడవక గ్రామాలకు గ్రామాలు ఖాళీ ఖాళీ అయ్యాయని, పొట్ట చేత పట్టుకొని తెలంగాణలోని జిల్లాలకు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు తట్టా ,బుట్టతో మనోవేదనతో వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, వలసల నివారణకు వెంటనే ఉపాధి హామీ పని కల్పించాలని కోరారు. అలాగే మండలంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వలస వెళ్లిన పనులు లేక కొందరు తిరిగి గ్రామాలకు వస్తున్నారని, రెక్క ఆడితే గాని డొక్క నిండని పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వలసలు నివారణ కోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయకపోవడంతో పేదలు పథకానికి దూరం కావలసి వస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

