ఏపీలో దేవాలయాలకు పూర్వ వైభవం…
1 min read

1058 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.846 కోట్లు మంజూరు
రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి
రూ. 4.25 కోట్ల తో నిర్మించిన దేవాదాయ శాఖ కర్నూలు జోన్ పరిపాలనా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు : అభివృద్ధి,సంక్షేమం, పారిశ్రామికం, ఆధ్యాత్మికం అన్నింటిలో రాష్ట్రాన్ని అగ్రగామి గా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం కర్నూలు నగరంలో రూ. 4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాదాయ శాఖ కర్నూలు జోన్ పరిపాలనా కార్యాలయ భవన సముదాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టి.జి భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్ విజయవాడలో గొల్లపూడిలో ఉన్నట్లు గానే, రాయలసీమకు కర్నూలులో ఈ ఆధ్యాత్మిక భవనం ఏర్పాటు చేయడం అత్యంత సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యాలయ సముదాయంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం తో పాటు ఇంజనీరింగ్, తదితర కార్యాలయాలు సముదాయాలు కూడా ఉన్నాయని, నూతన కార్యాలయం కర్నూలు నుండి కాణిపాకం పనిచేస్తుందన్నారు.
1058 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు..
పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ కింద నిధులను మంజూరు చేసి పనులను చేపట్టడం జరుగుతోందన్నారు.. రాష్ట్రంలో 1058 ఆలయాలలో పునర్నిర్మాణ పనులు మరియు గతంలో ఆపేసిన పనులన్నింటికీ రూ. 846 కోట్లు నిధులు మంజూరు చేశామని, ఒకటి, రెండు ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యం లో దేవాలయాలకు పూర్వ వైభవం వస్తోందని మంత్రి తెలిపారు.
ధూపదీప నైవేద్యాలకు రూ.18.36 కోట్లు
కర్నూలు జిల్లాలో 153 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం రూ.18.36 కోట్లు, ఆలయాల పునర్నిర్మాణ పనుల కోసం రూ.14 కోట్లు, నంద్యాల జిల్లాలో 39 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ. 37.8 కోట్లు, ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.50.12 కోట్లు, అనంతపురం జిల్లాలో ధూపదీప నైవేద్యాల కోసం 58.32 కోట్లు, ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ. 26.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.
ఘనంగా గోదావరి, కృష్ణా పుష్కరాలు
రాష్ట్రంలో గోదావరి కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు..2027 జూన్ 26 నుంచి జూలై ఏడవ తేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆగమ పండితులు, వేద పండితులు తేదీలను నిర్ణయించడం జరిగిందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి.. పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.


