విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బంకులు దగ్ధం
1 min read

చిరు వ్యాపారుల 20 లక్షల ఆస్తి నష్టం.
షార్ట్ సర్క్యూట్ కు కాలిపోయిన బంకులను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు
పత్తికొండ , న్యూస్ నేడు: స్థానిక పోలీస్ స్టేషన్ వెనుక వైపు భాగాన ఉన్న ఐదు వ్యాపార వాణిజ్య బంకులు సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా, చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బంకులలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణపరిహారం లక్ష రూపాయలు చెల్లించి, వ్యాపారాలు కొనసాగించుకునేందుకు అవసరమైన వస్తు సామాగ్రిల తో పాటు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, మండల కార్యదర్శి యు. కారుమంచి, జిల్లా సమితి సభ్యులు గురుదాస్, కారన్న, కృష్ణయ్య ఉన్నారు.

