దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషి
1 min read

ప్రతి ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల
ప్రైవేటురంగంలో పెట్టుబడుల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన
దివ్యాంగ శక్తి పథకం లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి నారా లోకేష్
దివ్యాంగులతో మాటామంతీ
దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి లోకేష్
ఉండవల్లి, న్యూస్ నేడు: దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబునాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ ప్రయాణించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో దివ్యాంగ శక్తి పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి లోకేష్.. తన పక్కన కూర్చొన్న శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతీ కలిపారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల గౌరవం పెంచాలి. వారిలో పట్టుదల ఎక్కువ. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వికలాంగుల ఆత్మగౌరవం ముఖ్యం. సమాజంలో కూడా మహిళలను కించపరిచే పదాలను అందరూ విడనాడాలి. ఇందుకోసం నేను పోరాడుతున్నాను.
ప్రతి ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల
కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం. ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నాం. ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రావడం ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కల్పన జరగుతుంది. అందుకే అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. మంగళగిరిలో ప్రభుత్వ భూమి లభ్యత చాలా తక్కువగా ఉంది. అందుకే కాజా వద్ద 75 ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నాం. మంగళగిరికి 4,5 ఐటీ కంపెనీలను తీసుకువస్తాం. సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుంది.
అమెరికా వెళ్లడం నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్
స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. స్త్రీలు ఎవరిపై ఆధారపడకూడదు. ఇంటర్ తర్వాత అమెరికా వెళ్లడం నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్. నా సొంత కాళ్లపై నిలబడగలిగాను. దాదాపు 8 ఏళ్లు నేను యూఎస్ లో ఉన్నాను. చదువుతో పాటు ఉద్యోగం చేశాను. దీంతో అవగాహన వచ్చింది. సదరు దివ్యాంగుల యోగక్షేమాలను, ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధిని ఈ సందర్భంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ అందుకున్న తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్, సీఎం సందేశం వస్తున్నాయా అని వాకబు చేశారు. తమ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రభుత్వంలో అన్నివిధాల అండగా ఉంటామని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.



