ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
1 min read

ప్రముఖ విభాగాల్లో వైద్య సిబ్బందిని పెంచండి
ఆసుపత్రిలో పారిశుద్వానికి అత్యంత ప్రాధాన్యత
వేసవి తాపాన్ని ఎదుర్కొనేలా వసతులు ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఛాంబర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన మెరుగల వైద్య సేవలు అందించేందుకు పరికరాలు సంబంధిత అంశాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.జిలానీ, డిసిహెచ్ఎస్ డా.ఓ.లలితా, ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీర్లు నరసింహారెడ్డి జయరాంరెడ్డి, ఎడి మస్తాన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న మొత్తం 84 ఎయిర్ కండీషనర్లలో 29 పనిచేయకపోవడం గమనించిన కలెక్టర్, వాటిలో మరమ్మతులకు అనువైనవి ఎన్ని, కొత్తగా అవసరమయ్యేవి ఎన్ని అన్నదానిపై తక్షణ అంచనా వేయాలని ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, పాథాలజీ మరియు మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో ఏసీలు సమర్థంగా పనిచేయడం అత్యవసరమని పేర్కొంటూ, ఈ విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆసుపత్రి సేవల్లో నిర్లక్ష్యం కనబరిస్తే సంబంధిత విభాగాధిపతులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సేవల నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.

