ఎన్నికల విధులపై సంపూర్ణ అవగాహన అవసరం
1 min read
పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు
పోలింగ్ సామగ్రి స్వీకరణ, ఓటింగ్ నిర్వహణపై అధికారులకు అవగాహన
అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన ఉండాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ సామగ్రి స్వీకరణ, పోలింగ్ నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ పెట్టెల నిర్వహణపై ప్రాయోగిక ప్రదర్శన నిర్వహించి, ఎన్నికల విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రార్థనా మందిరాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించే వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మేయర్ స్థాన రిటర్నింగ్ అధికారి, సెట్కూరు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కె. వేణుగోపాల్, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



